దళిత నేత మహసేన రాజేశ్ తెలుగు దేశం తీర్థం పుచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఈ రోజు తన పర్యటనలో భాగంగా సామర్లకోటలోని దళిత సామాజిక వర్గంతో సమావేశం అయ్యారు.
ఈ కార్యక్రమంలో మహాసేన రాజేశ్ టీడీపీలో చేరారు. ఆయనకు అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రాజేశ్ మాట్లాడుతూ… చీకటి వచ్చిన తర్వాతే వెలుగు విలువ తెలుస్తుందని ఆయన అన్నారు.
సీఎం జగన్ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో తమకు అర్థమవుతోందన్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు దళిత ద్రోహి అంటూ జగన్ పేర్కొన్నారని చెప్పారు. తాము కూడా జగన్ మాటలు నమ్మి అవి నిజమేనని భావించామన్నారు.
కానీ నిజమైన దళిత ద్రోహి ఎవరో త్వరలోనే తాము గుర్తించామన్నారు. జగన్ మాటలు నమ్మి చంద్రబాబును తాము అపార్థం చేసుకున్నామని ఆయన వాపోయారు. ఎస్సీల కోసం 27 పథకాలను అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన కొనియాడారు. అధికారంలోకి రాగానే జగన్ వాటిని రద్దు చేశారని ఆయన ఆరోపించారు.