– మళ్లీ తెరపైకి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ అంశం
– మర్డర్ ప్లాన్ కేసులో అనూహ్య పరిణామం
– రాఘవేంద్ర రాజు, పుష్పలత పిటిషన్లపై విచారణ
– మంత్రి సహా 18 మందికి నోటీసులు
కొన్నాళ్ల క్రితం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారని మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు, నాగరాజు, అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు, యాదయ్య, విశ్వనాథ్, మున్నూరు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరంతా బెయిల్ పై విడుదలయ్యారు. అయితే.. బయటకొచ్చాక రాఘవేంద్ర రాజు మహబూబ్ నగర్ కోర్టును ఆశ్రయించాడు.
శ్రీనివాస్ గౌడ్ పై ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారంటూ పిటిషన్ లో పేర్కొన్నాడు. తన ఇంట్లోకి చొరబడి పెన్ డ్రైవ్ లు, సీసీటీవీ హార్డ్ డిస్కులను దొంగలించారని వివరించాడు. అలాగే విశ్వనాథ్ సతీమణి పుష్పలత కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో తన భర్త ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని అందుకే కిడ్నాప్ చేశారంటూ పేర్కొంది.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన మహబూబ్ నగర్ కోర్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 18 మందికి నోటీసులు జారీ చేసింది. దీంతో మరోసారి మంత్రి అఫిడవిట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నవంబర్ 14న శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. దానిని ఎన్నికల కమిషన్ వెంటనే తమ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేసింది. అయితే, దాని స్థానంలో ఫలితాలకు రెండు రోజుల ముందు కొత్తది అప్ లోడ్ చేశారని విమర్శలు ఉన్నాయి.
లోపాలు ఉన్న మొదటి అఫిడవిట్ ను వెబ్ సైట్ నుంచి తొలగించినట్లు.. రాఘవేంద్ర రాజు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. దీన్ని వెనక్కి తీసుకోవాలని రాఘవేంద్ర రాజు, అతని సోదరులు, మరికొంతమందిపై ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మంత్రి హత్యకు కుట్ర పన్నారని ఫిబ్రవరిలో రాఘవేంద్ర రాజు సహా పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బయటకొచ్చాక కూడా రాఘవేంద్ర రాజు ఆఫీస్ పై దాడి జరిగింది. ఎంత భయపెట్టినా తాను లీగల్ గానే ముందుకు వెళ్తానని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే గత నెలలో మహబూబ్ నగర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతోపాటు పుష్పలత కూడా పిటిషన్ వేయడంతో విచారణ జరిపిన న్యాయస్థానం.. శ్రీనివాస్ గౌడ్ , సైబరాబాద్ సీపీ, డీసీపీ బాలానగర్ తో పాటు మొత్తం 18 మందికి నోటీసులు జారీ చేసింది. వీరంతా ఆగస్టు 10న హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.