తెలుగు స్టార్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందనేది అనుమానాలకు ఆస్కారం లేని విషయం. తనకున్న క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని, డిమాండ్‌ని సరైన రీతిలో వాడుకోవడంలో ఎవరైనా సరే మహేష్ తర్వాతే. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసి, వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా బ్రహ్మాండంగా, జోరుగా సంపాదిస్తూ దూసుకుపోతున్నాడు మహేష్.
దీనితో పాటుగా తెలుగు సినీ పరిశ్రమలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల లిస్టు చూస్తే, ముందు వరుసలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మహేష్‌బాబు పోటాపోటీగా ఉంటారు. పవన్ సినిమాలు చెయ్యట్లేదు కాబట్టి ఇప్పుడు మహేష్‌బాబే టాప్ అని చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా తన సొంత బేనర్, ఎంబీ ప్రొడక్షన్స్ మొదలుపెట్టిన మహేశ్ బాలీవుడ్ తరహాలో మరో అడుగు ముందుకేశాడు. ఇప్పుడూ తను తాజాగా నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో మరో కొత్త అధ్యాయానికి తెరలేపినట్టు సమాచారం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు సినిమాకి గాను మహేష్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. అందుకు బదులుగా ఆ సినిమాకు తాను కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే తన వాటా కింద ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం సొంతం చేసుకుంటాడట. డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్… ఇవన్నీ ఇప్పుడు విపరీతమైన డిమాండ్ పెంచుకున్న మార్కెట్స్. ఇప్పటికే వరుసగా భరత్ అనే నేను, మహర్షి రూపంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ నెక్స్ట్ సినిమా “సరిలేరు నీకెవ్వరు”కు తక్కువలో తక్కువ అనుకున్నా 50 కోట్లకు తగ్గకుండా సొమ్ము చేసుకుంటాడని ఓ అంచనా.