టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరియర్‌లో చాలా వరకూ మనకు దర్శకుల విషయంలో ఒక క్లియర్ కట్ ఫ్యాక్ట్ దర్శనమిస్తుంది. తనకు సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడికి మళ్ళీ అవకాశమివ్వడం, ఆ సినిమా ఫ్లాప్ కావడం ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది. ముందుగా మహేశ్ కెరియర్‌కు మొదటి బ్లాక్ బస్టర్ సినిమా ఒకడు. ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ తో మహేశ్ మళ్ళీ అర్జున్ సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ కాకపోయినా జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో అవకాశంగా ఈ కాంబినేషన్‌లో వచ్చిన సైనికుడు సినిమా అట్టర్‌ఫ్లాప్ అయింది.
ఆ తరువాత మహేశ్ కెరియర్లో మరో పెద్ద హిట్‌గా నిలిచిన సినిమా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఖలేజా సినిమా చేశారు. రిజల్ట్ తెలుసుగా మరో గొప్ప ఫ్లాప్. ఆ తర్వాత మహేశ్ కెరియర్లో మరో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ ఆగడు సినిమా కోసం జతకట్టారు. కానీ ఆ సినిమా మహేశ్‌కు ఒక పీడకలలా మిగిలిపోయింది. అదే విధంగా మహేశ్ బాబు కెరియర్లో ఒక మరచిపోలేని మల్టీస్టారర్ ఫీల్ గుడ్ సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ఆ సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తన స్టైల్‌కి ఫిదా అయి మహేశ్ తనతో మళ్ళీ బ్రహ్మోత్సవం సినిమా చేయడం, ఆ సినిమా ఎక్కడలేని బ్యాడ్ టాక్ మూటకట్టుకోవడం జరిగిపోయింది. ఇన్నిసార్లు రిపీట్ అయినా సరే మళ్ళీ ఇప్పుడు మహేశ్ తనకు మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. మరి ఫలితం ఇదివరకటిలానే చేదు అనుభవాన్ని మిగిలిస్తుందేమో అని మహేశ్ అభిమానులు వాపోతున్నారు. ఐతే, ఈ కాంబినేషన్ రిపీట్ చేసిన ఓ రెండుసార్లు మాత్రం ఫలితాలు బానే ఉండడం కూడా ఒక కొసమెరుపు. పోకిరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాధ్‌తో చేసిన తరువాతి సినిమా బిజినెస్ మ్యాన్ బానే ఆడింది. అలాగే శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కొరటాల శివతో చేసిన రెండవ సినిమా “భరత్ అనే నేను” కూడా మంచి ఫలితాలనే ఇచ్చింది. అయినా సరే తమ ప్రిన్స్‌కు ఈ రిపిటీషన్ అచ్చిరాదు అంటున్నారు అభిమానులు.