మనుష్యులందు నీ కధ - Tolivelugu

మనుష్యులందు నీ కధ

సమాజ సేవలో శ్రీమంతుడు

గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరచినదా.. అంటూ శ్రీమంతుడు సినిమాలో బ్యాగ్రౌండ్ సాంగ్ ఒకటుంది. అది సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు అక్షరాలా వర్తిస్తుంది. తాను కేవలం రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు రియల్ లైఫ్‌లో కూడా నిజమైన హీరో అని నిరూపించుకున్నవైనం వెలుగులోకి వచ్చింది. అదేదో సినీ ఫక్కీలో ఛేజ్‌లు, ఫైట్లు చేసి కాదండోయ్. మానవత్వాన్ని చాటుకుని మహేశ్ తను మనిషినని నిరూపించుకున్నాడు. సామాజిక సందేశాన్ని అందించే చిత్రాలను ఎంచుకోవడంలో ముందుండే మహేశ్ ఇప్పుడు నిజంగా సమాజసేవ చేసే అవకాశం రావడంతో ముందుకొచ్చాడు. ఒకటీ, రెండు కాదు మొత్తం 1000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి మహేశ్ తన మానవత్వాన్ని ప్రదర్శించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. , మనుష్యులందు నీ కధ
వివరాల్లోకి వెళ్తే మహేశ్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్‌తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పద్దెనిమిది ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాడు. ఈ ప్రక్రియ దాదాపు గత మూడేళ్ళ నుంచి జరుగుతూ వస్తోంది. ఈ మెడికల్ క్యాంపుల్లో మహేశ్ బాబు భాగస్వామ్యంలోని ఫౌండేషన్ ఇప్పటికి మొత్తం 1000 శస్త్ర చికిత్సలు పూర్తిచేసినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగా హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ అనే ఇంగ్లండ్‌కి చెందిన ఒక ప్రముఖ సంస్థతో కలిసి చిన్నారుల ఆరోగ్యం గురించిన అవగాహన అందించారు.
ఇంతకీ హృద్రోగంతో బాధపడే చిన్నపిల్లలకు శస్త్రచికిత్సలు అందించాలనే ఈ సామాజిక భాద్యత పట్ల మహేశ్‌ ఎందుకు ఆసక్తి చూపాడో తెలుసా? దీని వెనుక మహేశ్ కుమారుడు గౌతమ్ కృష్ణ ఉన్నాడట. గౌతమ్ కృష్ణ, తల్లి నమ్రత గర్భంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని, ఒక దశలో డెలివరీ కూడా చాలా కష్టమయిందట. పుట్టిన తర్వాత కూడా గౌతమ్ ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదట. ఆ సమయంలోనే తనకు ఒక శస్త్రచికిత్స సైతం చేయించాల్సి వచ్చినట్టు, తన దగ్గర ఆర్థిక స్థోమత ఉన్నందున కావలసినంత ఖర్చు చేసి తన కొడుకును బతికించుకోగలిగానని, మరి పేదవారి సంగంతేంటని ఆలోచించాడట మహేశ్. ఆ సమయంలోనే మహేశ్ మదిలో మెదిలిన ఆలోచనలకు రూపమే ఇప్పుడు ఈ వెయ్యి శస్త్ర చికిత్సలు. మహేశ్ బాబులాగా మరింతమంది సంపన్నులు సహృదయత చాటుకుంటే సమాజం ఆరోగ్యకరంగా తయారవుతుంది. సెహభాష్ మహేశ్..  నువ్వు నిజంగా మంచి మనసున్న శ్రీమంతుడివి… నిజమైన మహర్షివి!!!

Share on facebook
Share on twitter
Share on whatsapp