సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఏదైనా సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు చాలావరకూ ఆ షూటింగ్ తాలూకు అప్డేట్స్ పెద్దగా బయటకు రావు. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరూ” సినిమా మాత్రం అందుకు భిన్నంగా సాగిపోతోంది.
ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అందరికీ చెబుతూ వస్తున్నాడు. ఒక విధంగా తను ఈ స్ట్రాటజీతో మహేశ్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తూ వెళుతున్నాడు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 4 కోట్ల ఖర్చుతో వేస్తున్న ఒక భారీ సెట్టింగ్ అప్డేట్ విడుదల చేశాడు దర్శకుడు. కర్నూలులో ఉన్న కొండారెడ్డి బురుజు సెట్ అది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కర్నూల్ వెళ్ళి అక్కడ కొండారెడ్డి బురుజు దగ్గర షూటింగ్ చెయ్యడం కష్టమవుతుందని భావించిన యూనిట్, అందుకోసం ప్రత్యేకంగా ఈ సెట్ వేశారట. అన్నట్టు కొండారెడ్డి బురుజు..
కర్నూల్ అంటుంటే మీకు ఓ సినిమా గుర్తొచ్చుండాలే? యస్… మహేశ్‌బాబు కెరియర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఒక్కడు’ సినిమా. ఆ సినిమాలో కూడా కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయి.
ఒక్కడు సినిమా గుర్తుచేసుకుంటూ ఫాన్స్ ఇప్పుడు చేస్తున్న సరిలేరు సినిమాతో పోల్చుకుంటున్నారు. సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అయ్యే సినిమా ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇప్పుడు ఈ సరిలేరు నీకెవ్వరు కూడా ఒక్కడు రేంజ్‌లో భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమనుకోవచ్చా.