ఓవర్సీస్ లో మహేష్ స్టామినా గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అతడి స్టామినా మరోసారి ఎలివేట్ అయింది. సర్కారువారి పాట సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. రిలీజైన 4 రోజులకే ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు ఆర్జించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఇప్పటివరకు మహేష్ నటించిన 11 సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. ఏ తెలుగు హీరోకు అందనంత ఎత్తు ఇది. ఇప్పుడు 2 మిలియన్ డాలర్ సినిమాల విషయానికొస్తే.. సర్కారువారి పాటతో కలిపి మహేష్ నటించిన 4 సినిమాలు 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. ఇది కూడా ఓ రికార్డే.
ఇలా 2 మిలియన్ డాలర్ క్లబ్ లో నాలుగేసి సినిమాలు కలిగిన హీరోలు సౌత్ నుంచి మరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్లు రజనీకాంత్, ప్రభాస్ మాత్రమే. ఎన్టీఆర్ కు 2 మిలియన్ క్లబ్ సినిమాలు 3 ఉన్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండకు 2 మిలియన్ క్లబ్ లో చెరో రెండేసి సినిమాలున్నాయి.
ఇక సర్కారువారి పాట సినిమా విషయానికొస్తే.. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ సినిమాకు మరో 5 లక్షల డాలర్లు కావాలి. వర్కింగ్ డేస్ మొదలవ్వడంతో సినిమాకు వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. ఈ వారాంతానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందనే అంచనాలున్నాయి.