ఏడున్నరేళ్లలో తెలంగాణ పరిస్థితి అట్టడుగుస్థాయికి పడిపోయిందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి హుజూరాబాద్ ఎన్నికను వాయిదా వేయించారని ఆరోపించారు.
వరి సాగు విషయంలో రైతులను ప్రభుత్వం అయోమయంలోకి నెట్టిందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం సరైన నిర్ణయం ప్రకటించాలని.. పండించిన ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మహేష్ గౌడ్.
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం బ్లూ ప్రింట్ గీసిందన్న ఆయన… ఇంకో నాలుగైదు నెలల్లో ఆస్తులును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతారని చెప్పారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సినిమా నటులను మంత్రి కేటీఆరే రక్షించారని ఆరోపించారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, రానాలను ఎక్సైజ్ కేసు నుంచి తప్పించారని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్.