మహేష్, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు భారీ ప్రమోషన్ చేశారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయడంతో పాటు.. స్వయంగా మహేష్ రంగంలోకి దిగి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. గతంతో పోలిస్తే కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు. అయితే ఇదంతా ఒకెత్తు, ఇప్పుడు చేయబోయే ప్రచారం మరో ఎత్తు కాబోతోంది.
అవును.. మహేష్ మూవీకి ఇప్పుడు ప్రచారం అవసరం. ఎందుకంటే, ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఏకగ్రీవంగా హిట్ టాక్ అయితే రాలేదు. సో.. ఇలాంటప్పుడు సినిమాకు మరింత ప్రమోషన్ అవసరం. అక్కడక్కడ ఉన్న మిక్స్ డ్ టాక్ ను పోగొట్టి, సినిమాను సేఫ్ వెంచర్ గా మార్చాలంటే మహేష్ తో పాటు టోటల్ టీమ్ అంతా మరోసారి రంగంలోకి దిగాల్సిందే.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ ఈ సినిమాకు చాలా అవసరం. ఇలాంటప్పుడు ప్రచారాన్ని ఆపేస్తే, కలెక్షన్లపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఇప్పటికే మూవీకి ఆక్యుపెన్సీ పడిపోయింది కాబట్టి ఈ వారం కూడా మహేష్ మూవీని ప్రమోట్ చేయాల్సిందే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు 36 కోట్ల రూపాయల వరకు షేర్ వచ్చింది. కానీ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో వారం రోజులు ఆడాలి, ఈ వీకెండ్ తో పాటు.. వచ్చే వీకెండ్ కూడా వసూళ్లు బాగుండాలి. అప్పుడు మాత్రమే బ్రేక్ ఈవన్ అవుతుంది. అలా అవ్వాలంటే మహేష్ మరో 4 రోజుల పాటు ప్రచారం చేయాల్సిందే.