సెలబ్రిటీలు ఏం చేసినా అది పెద్దగానే ఉంటుంది. అది పెళ్లయినా, పార్టీ అయినా అందులో తమ రేంజ్ చూపించాలనుకుంటారు. చాలామంది స్టార్లు, డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునేది ఇందుకే. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన మార్క్ చూపించాడు. కొడుకు పదో తరగతి పాస్ అయిన సందర్భంగా, మహేష్ కుటుంబం మొత్తం జర్మనీలో పెద్ద పార్టీ చేసుకుంది.
నిజానికి ఈ పార్టీ కోసం మహేష్ జర్మనీ వెళ్లలేదు. ఎప్పట్లానే కుటుంబంతో కలిసి అతడు యూరోప్ ట్రిప్ వెళ్లాడు. సరిగ్గా అదే టైమ్ లో టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. మహేష్ కొడుకు గౌతమ్, అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించాడు. దీంతో మహేష్-నమ్రత ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోషల్ మీడియా వేదికగా కొడుకును పొగిడారు.
రిజల్ట్ వచ్చే టైమ్ కు పారిస్ లో ఉన్నారు. అక్కడ్నుంచి జర్మనీకి చేరుకొని, ఓ ఖరీదైన హోటల్ లో పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించి మహేష్ బాబు ఓ సెల్ఫీని కూడా విడుదల చేశాడు. ఈ సెల్ఫీతో మహేష్ కుటుంబం ఎక్కడుందనే విషయంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం చదువుపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు గౌతమ్. వన్-నేనొక్కడినే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ఎప్పటికప్పుడు అతడి సినిమాపై మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ.. మహేష్ మాత్రం కొడుకును పూర్తిగా చదువు వైపే ఉంచాడు. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేటిగ్గా సినిమాల్లోకి వస్తాడు గౌతమ్.