మొన్ననే విదేశాలకు వెళ్లి వచ్చాడు మహేష్. కుటుంబంతో పాటు యూరోప్ వెళ్లిన ఈ హీరో.. 3-4 దేశాల్లో ఎంచక్కా సేదతీరి వచ్చాడు. ఫుల్ గా రీఫ్రెష్ అయ్యాడు. ఇక కొత్త సినిమా స్టార్ట్ చేయడమే తరువాయి అనుకున్న టైమ్ లో మరోసారి విదేశీలకు వెళ్తున్నాడు ఈ హీరో. ఈసారి పెట్టుకున్న టూర్, విహారానికి సంబంధించించి మాత్రం కాదు.
మహేష్ కుమారుడు ఇంటర్మీడియట్ కు వచ్చాడు. ఆల్రెడీ సిటీలో ఓ కాలేజ్ లో జాయిన్ చేశారు. కానీ.. ఇంటర్ నుంచి గౌతమ్ ను విదేశాల్లో చదివించాలనేది మహేష్ ఆలోచన. ఆ దిశగా ఓ కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ పని మీద మహేష్ మరోసారి విదేశాలకు వెళ్లబోతున్నట్టు సమాచారం. అయితే.. గౌతమ్ ఏ దేశంలో, ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నాడనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచారు.
త్వరలోనే కుటుంబంతో పాటు మరోసారి విదేశాలకు వెళ్లి, గౌతమ్ ను కాలేజీలో చేర్పించబోతున్నాడు మహేష్. అందుకే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు చేయబోయే కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది.
లెక్కప్రకారం.. ఈ నెలలోనే మహేష్-త్రివిక్రమ్ కలిసి సెట్స్ పైకి రావాలి. ఈ మేరకు ఆర్ట్ డైరక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్ కూడా నిర్మించాడు. కానీ, మధ్యలో ఈ కాలేజీ సీటు వ్యవహారం రావడంతో సినిమా షూటింగ్ ను వచ్చే నెలకు వాయిదా వేశారు. ఈ మేరకు హారిక-హాసిని సంస్థ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్.