సర్కారువారి పాటకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు మహేష్. సినిమాలో కీర్తిసురేష్ తో జరిగిన కీలకమైన గొడవ ఎపిసోడ్ కు సంబంధించిన మేటర్ ఇది. సినిమాలో మహేష్ ను కీర్తిసురేష్ మోసం చేస్తుంది. ఆ విషయం మహేష్ కు తెలిసిపోతుంది. అడగడానికి వెళ్లిన మహేశ్ ను కీర్తిసురేష్ తిడుతుంది. ఆ వెంటనే వెన్నెల కిషోర్ ను కొడుతుంది. అది తట్టుకోలేక మహేష్, కీర్తిసురేష్ ను లాగి ఒకటి కొడతాడు.
నిజానికి ఈ సీన్ ఇక్కడివరకే. అయితే ఆ తర్వాతే అసలైన మేజిక్ జరిగిందని చెప్పుకొచ్చాడు మహేష్. సీన్ కట్ అయిన తర్వాత మరో టేక్ చేద్దాం అన్నాడట దర్శకుడు పరశురామ్. ఈసారి కీర్తిసురేష్ ను లాగి కొట్టిన తర్వాత, ఆమెపైకి కాలెత్తమన్నాడట. ఆ సీన్ ను ఓ చిన్న స్ట్రీట్ ఫైట్ కింద మార్చేద్దామని, అప్పుడు మరింత సహజంగా ఉంటుందని అన్నాడట.
అమ్మాయి మీదకు కాలెత్తితే బాగుంటుందా అంటూ అనుమానం వ్యక్తం చేశాడు మహేష్. చాలా బాగుంటుంది కాలెత్తండి అన్నాడట పరశురామ్. ఆ తర్వాత ఆ సీన్ పెద్ద హిట్టయింది.
ఈ సన్నివేశంపై కీర్తిసురేష్ కూడా స్పందించింది. అక్కడ కాలెత్తడం వల్ల, సెకండాఫ్ లో తనపై కాలు వేసే సీన్ కు జస్టిఫికేషన్ వచ్చిందని కొత్త లాజిక్ బయటపెట్టింది. మొత్తమ్మీద సర్కారువారి పాట సినిమాలో పరశురామ్ స్క్రిప్ట్ తో పాటు మహేష్ ఇంప్రవైజేషన్లు కూడా చాలానే ఉన్నట్టున్నాయి.