ఇప్పటికే మహేష్ బాబు చేయాల్సిన ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ విజయ్ దేవరకొండ చేతికి వెళ్లింది. ఇప్పుడు మహేష్ చేయాల్సిన ఓ సినిమా కూడా దేవరకొండ చెంతకు చేరింది. అదే జనగణమన ప్రాజెక్టు. ఈ సినిమాను విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తానని పూరి జగన్నాధ్ పరోక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా మహేష్-పూరి మధ్య నలిగిన ఈ సబ్జెక్ట్ ఇప్పుడెందుకిలా చేతులు మారింది.
జనగణమన సబ్జెక్ట్ ఇలా విజయ్ దేవరకొండ చేతికి చేరడానికి మహేష్ మైండ్ సెట్ కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ప్రయోగాలు చేసే స్టేజ్ లో లేడు. తన సినిమాల్లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్.. ఇలా అన్నీ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. అందుకే సందీప్ రెడ్డి వంగ చెప్పిన కథకు కూడా నో చెప్పేశాడు. బిజినెస్ మేన్ టైపులో మరోసారి హార్డ్ కోర్ కథతో సినిమా తీయాలనే ఆలోచన మొన్నటివరకు ఉన్నప్పటికీ, అదే స్టయిల్ లో సాగే జనగణమనను పట్టాలపైకి తీసుకురావడానికి మహేష్ మనసు ఒప్పడం లేదు.
పైగా ఇక్కడ వివాదాలు కూడా లేవు. ఎందుకంటే, జనగణమన సినిమాకు సంబంధించి మహేష్ కు అప్ డేట్ ఇచ్చిన తర్వాత పూరి జగన్నాధ్, దేవరకొండ వైపు వచ్చాడు. జనగణమన సినిమాకు ఓకే చెబితే ఆగుతానని, లేదంటే విజయ్ దేవరకొండతో ముందుకెళ్తానని పూరి జగన్నాధ్, మహేష్ ను కోరడం, మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అలా జనగణమన ప్రాజెక్టు దేవరకొండ చెంతకు చేరింది.
ఈమధ్య కాలంలో మహేష్ వదులుకున్న రెండో ప్రాజెక్టు ఇది. ఇంతకుముందు పుష్ప సినిమాను ఇలానే వదులుకున్నాడు మహేష్. అది వెళ్లి బన్నీ చేతిలో పడింది. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఇప్పుడు జనగణమన సినిమా వదులుకున్నాడు. ఇది విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.