“అది హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్. పార్క్ లో మహేష్ బాబు జాగింగ్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ పాము సడెన్ గా మహేష్ పైకొచ్చింది. కళ్లముందే బుస కొట్టింది. దీంతో మహేష్ వెనక్కి పరుగులంకించుకున్నాడు. పార్క్ చుట్టూ తిరిగి ఎలాగోలా గేటు నుంచి బయటపడ్డాడు.”
మహేష్ జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఇది. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు బయటపెట్టాడు. ఆ ఘటన జరిగిన తర్వాత మళ్లీ కేబీఆర్ పార్కులో అడుగుపెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన మహేష్ బాబు, ఈ విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఇది ప్రోమో మాత్రమే. అసలు కార్యక్రమం ఫిబ్రవరి 4వ తేదీన ప్రసారం అవుతుంది.
బాలయ్యతో చిట్ చాట్ లో చాలా విషయాలు బయటపెట్టాడు మహేష్. తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాస్త ఎక్కువనే విషయాన్ని కూడా అంగీకరించాడు. పైకి సాఫ్ట్ గా, కూల్ గా కనిపించినప్పటికీ.. టైమ్ చూసి ఎదుటి వ్యక్తిపై సెటైర్లు వేస్తానంటున్నాడు. ఈ కార్యక్రమంలో మహేష్ తో పాటు అతడి ఫ్రెండ్ వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నాడు. తనకు ఎదురైన పాము ఘటన లాంటివి మహేష్ ఇంకెన్ని ఈ కార్యక్రమంలో బయటపెట్టాడో చూడాలి.