తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏఐసీసీ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఇంచార్జ్ గా ఉన్న మీరే ఇలా చేస్తే ఎలా.. అంటూ రాసిన లేఖ సంచలనంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ విధేయుడైన నేను మీకు ఇలాంటి ఆవేదనా భరిత లేఖ రాయాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదన్నారు ఏలేటి. తన 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా ఇదే మొదటి సారి అన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, తెలంగాణ ఛైర్మన్ గా పార్టీ హైకమాండ్ రూపొందించిన ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నానన్నారు.
దాదాపు రెండేళ్లుగా ఈ బాధ్యతలను నా శక్తి మేరకు ఎక్కడా రాజీ పడకుండా నిర్వహిస్తున్నానన్నారు. ఏ నాడు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. పార్టీ ముఖ్యులకు సహకరిస్తూ.. సర్దుకు పోయే శైలి తనదన్నారు. అలాంటిది హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన తరువాత అర్థాంతరంగా నిలిపివేయాలని ఆదేశించడం తీవ్రంగా బాధించిందన్నారు ఆయన.