కోల్ కతా లోని ఓ దుర్గాపూజా మండపం లో దుర్గాదేవి.. మహిషాసురుని సంహరిస్తున్నట్టు ఉన్న విగ్రహం.. అచ్చు మహాత్మా గాంధీ ముఖాన్ని పోలి ఉండడం వివాదాస్పదమైంది. దీంతో ఇలా దీన్ని రూపొందించిన అఖిల్ భారతీయ హిందూ మహాసభ చిక్కుల్లో పడింది. చివరకిది హోం శాఖ వరకు వెళ్లడం, అక్కడినుంచి ఆదేశాలు రావడంతో నిర్వాహకులు దాన్ని సరి చేయడంతో వివాదం సద్దు మణిగింది. కానీ ఇది అంత సులువుగా ముగియలేదు. ఈ సంస్థపై బెంగాల్ ప్రొవిన్షియల్ మహాసభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు కూడా దీనికి మద్దతు పలికారు. పైగా చాలామంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
భారతీయ హిందూ మహాసభ అని చెప్పుకొంటున్నవారి నిర్వాకాన్ని ఖండిస్తున్నామని, తమను హిందూ మహాసభ అని ప్రకటించుకున్నవారే ఇలా చేయడం విచారకరమని బెంగాల్ ప్రొవిన్షియల్ మహాసభ నేతలు అన్నారు. ఇది జాతిపితకే కాక .. ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అవమానమని పాలక తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ పేర్కొన్నారు.
గాంధీజీని హతమార్చినవారెవరో.. ఏ ఐడియాలాజికల్ గ్రూపు వారో తమకు తెలుసునన్నారు. అయితే ఇది దురదృష్టకర సంఘటన అని బెంగాల్ బీజేపీ శాఖ చీఫ్ సుకాంత మజుందార్ వ్యాఖ్యానించారు. తాము కూడా దీన్ని ఖండిస్తున్నామన్నారు.
ఇంత జరిగినా అఖిల్ భారతీయ హిందూ మహాసభ నేతలు ఇదేదో పొరబాటుగా జరిగినట్టు చెప్పుకున్నారు. గాంధీజీ ముఖం మహిషాసురుని పోలి ఉందంటే అది కేవలం కాకతాళీయమేనని, ఫోటోలు వైరల్ అయిన తరువాత పోలీసులు వచ్చారని, వారి సమక్షంలోనే దీన్ని మార్చేశామని ఈ సంస్థ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి తెలిపారు. ఎవరి సెంటిమెంట్లనూ బాధ పెట్టాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. ‘పోలీసులు మార్చమన్నారు.. మేం మార్చేసాం .. మహిషాసుర విగ్రహంపై జుట్టు, మీసాలు పెట్టాం’ అని ఆయన చెప్పారు.