బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా టీ (చాయ్) చేస్తూ వెరైటీ వ్యాఖ్య చేశారు. ‘ఏమో ! ఇది నన్నెక్కడికి తీసుకువెళ్తుందో’ అని చమత్కరించారు. ప్రధాని మోడీ తానూ ఒకప్పుడు చాయ్ చేసి అమ్మినట్టు లోగడ చేసిన ప్రకటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆమె ఈ కామెంట్ చేశారు.
తన లోక్ సభ నియోజకవర్గమైన కృష్ణానగర్ లో ఆమె ఓ రోడ్డు పక్కన టీ స్టాల్ లో చాయ్ చేసి ఒకరిద్దరు కస్టమర్లకు అందించారు. ఆమెకు ఆ షాప్ కీపర్ కూడా సహకరించాడు ఈ ఏడాది కొత్తగా తృణమూల్ ప్రభుత్వం ప్రారంభించిన ‘దీదిర్ సురక్షా కవచ్’ పథకానికి చేబట్టిన ప్రచారంలో భాగంగా మహువా మొయిత్రా ఇలా టీ చేస్తూ ..ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు.
రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాలక పార్టీ నేతలు ఈ విధంగా ‘ప్రజాసేవ’కు పూనుకొంటున్నారు. మహువా పోస్ట్ చేసిన వీడియో, ఆమె కామెంట్ పై స్పందించిన బీజేపీ మాజీ నేత, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్.. ‘నేను పందెం కాస్తా.. ఇది మిమ్మల్నెక్కడికి తీసుకువెళ్తుందో..’ అని పరోక్షంగా మీరు ప్రధాని అయ్యే ఛాన్సే లేదు అని పేర్కొన్నారు.
ఇక మహువా వీడియోపై ట్విటర్ యూజర్లు తలోరకంగా వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.