జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కాదు వీలైతే తనకు మద్దతుగా నిలబడండి అంటూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా అన్నారు. కాళీ దేవీపై మోయిత్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆమె ఓ ట్వీట్ చేశారు.
బీకేర్ ఫుల్ మహువా పేరుతో చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ ఓ పద్యాన్ని ట్వీట్ లో పెట్టారు. ‘మొదట యూనివర్సిటీలకు వెళ్లాయి. ఆ తర్వాత రైతులు, హక్కుల కార్యకర్తలు, ఇప్పుడు మొత్తం దేశమే తగలబడిపోతోంది’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
జాగ్రత్తగా ఉండండని చెప్పకండి అంటూ వ్యాఖ్యానించారు. దాని బదులు మద్దతుగా నిలబడండి అని కోరారు. ఇటీవల కాళీ మాత గురించి ఓ టెలివిజన్ షోలో మహువా మాట్లాడుతూ… తనకు సంబంధించినంత వరకు కాళీ మాత కేవలం మాంసం తినే.. ఆల్కహాల్ దేవత మాత్రమేనని అన్నారు. మీరు బెంగాల్ లోని తారాపీఠ్ కు వెళితే అక్కడ సాధువులు సిగరెట్లు తాగడం కనిపిస్తుందంటూ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై నెటిజన్లు, హిందూ సంఘాలు ఫైర్ అయ్యాయి. ఇప్పటికే ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో నుపుర్ శర్మ పరిస్థితి ఉదహరిస్తూ.. జాగ్రత్తగా ఉండాలంటూ మహువాను పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇలా స్పందించారు.