బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని విమర్శిస్తు బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తప్పు పట్టారు. డాక్యుమెంటరీని షేర్ చేసే యూట్యూబ్ వీడియోలు, ట్వీట్లను బ్లాక్ చేయడం సరికాదన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య మూలాలు ప్రస్తుతం అభద్రతతో ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీబీసీ డాక్యుమెంటరీని భారత్‌లో ఏ ఒక్కరూ వీక్షించకుండా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుందన్నారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్ధకు సిగ్గుచేటని మండిపడ్డారు.
కేంద్రం తీరును టీఎంపీ మరో ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కూడా తప్పుబట్టారు. మోడీకి వ్యతిరేకంగా రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు సంబంధించి తాను ట్వీట్లు చేశానని, వాటిలో ఓ ట్వీట్ ను తొలగించారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోడీపై బీబీసీ రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని తీసింది. ఇందులో 2002లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో తలెత్తిన అల్లర్లకు సంబంధించిన విషయాలను డాక్యుమెంటరీలో ప్రస్తావించారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది. వలసవాద దృక్పధంతో ఎలాంటి లక్ష్యం లేని ప్రచారయావతో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందిందని పేర్కొంది.