తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదం తెలిపే తీర్మానం సందర్బంగా ఆమె ఎంపీ హేమమాలినిపై అన్ పార్లమెంటరీ భాషను ఉపయగించడంపై బీజేపీ సీరియస్ అయింది. ఆ వ్యాఖ్యలపై మహువా మొయిత్రా క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది.
తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని ఎంపీ మహువా మొయిత్రా సమర్థించుకున్నారు. పార్లమెంట్ లో పాటించాల్సిన మర్యాద గురించి బీజేపీ పాఠాలు చెబుతుండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. దీనిపై ఎంపీ హేమమాలిని మండిపడ్డారు.
మహువా తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హేమమాలిని హెచ్చరించారు. సమాచారం తెలుసుకోకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగితే పాపులర్ అయితే కావచ్చు కానీ ప్రజల్లో మాత్రం చులకన అవుతారంటూ ఆమె మండిపడ్డారు.
ఆ తర్వాత మహువా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల్లో లేవన్నారు. తాను ఆపిల్ ను ఆపిల్ అనే పిలుస్తానని, ఆరెంజ్ అని పిలవనన్నారు. తాను ఏది మాట్లాడినా నేరుగా మాట్లాడుతానన్నారు. ఈ విషయంపై పార్లమెంటరీ ప్రివిలైజ్ కమిటీ ముందుకు పిలిచినా తాను జరిగిన విషయాన్ని చెబుతానన్నారు.