బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర ఆరోపణలు చేశారు. దూబే నకిలీ ఎంబీఏ డిగ్రీ కలిగి వున్నారని, అక్రమ మార్గంలో పీహెచ్‌డీ పొందారని ఆమె ఆరోపించారు. దూబే లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు ఈ కారణాలు సరిపోతాయా అని స్పీకర్ ఓం బిర్లాను ఆమెను అడిగారు.
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై బడ్జెట్ ప్రసంగంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దూబే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను ఇచ్చారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ దూబే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మహువా మోయిత్రా ఈ ట్వీట్ చేశారు.
ఎన్నికల నామినేషన్ సమయంలో దూబే నకిలీ ఎంబీఏ ధ్రువ పత్రాలు సమర్పించారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు దీనిపై 2020లో జార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఆయన డిగ్రీ పత్రాలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిల్‌లో కోరారు.
నిషికాంత్ దూబే 2009,2014,2019లో ఎన్నికల నామినేషన్‌లలో తాను ఢిల్లీ వర్శిటీ నుంచి ఎంబీఏ ఉత్తీర్ణుడైనట్టు పత్రాలు సమర్పించారని పిటిషన్ లో పేర్కొంది. దీనిపై ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించగా ఆ పత్రాల్లో చెప్పినట్టు ఆయన ఆ కాలేజీలో ఎంబీఏ చేయలేదని తేలిందని పిల్ వెల్లడించింది.