హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారని భావించిన మైనంపల్లి హనుమంతరావు తన పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోకపోవడంతో తీవ్రంగా కలత చెందిన మైనంపల్లి హనుమంతరావు అందుబాటులో లేకుండా రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మైనంపల్లి ఎక్కడా కనిపించలేదు. వాటికి దూరంగా ఉండేందుకే మైనంపల్లి బెంగుళూరు వెళ్లిపోయారని సమాచారం. టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు . 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ టికెట్‌ను ఆశించగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన మైనంపల్లి టీఆరెఎస్‌లో చేరి ఆ పార్టీ మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన మైనంపల్లికి పార్టీ నాయకత్వం ప్రాధాన్యం ఇచ్చింది. తర్వాత పార్టీ గ్రేటర్ అధ్యక్షునిగా నియమించడమే కాకుండా, ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కాదని మైనంపల్లికి టికెట్ కేటాయించారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి మంచి మెజార్టీతో విజయం సాధించారు. దాంతో తనకు మంత్రివర్గంలో స్థానం ఖాయమని ఆశించారు. కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని కూడా మైనంపల్లి తన సన్నిహితుల దగ్గర పదేపదే చెప్పారని తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వకపోవడం ఆయన్ని బాగా నిరాశ పరచింది. అసంతృప్తితో రగిలిపోతున్నట్టు అతని మాటలను బట్టి అర్ధం అయ్యిందని సన్నిహితులు చెబుతున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మైనంపల్లి మిస్సింగ్ !