కొంతమందికి మామూలు ఇగో ఉండదు. ఎదురుపడితే నమస్తే పెట్టలేదని హర్ట్ అవుతుంటారు. కాస్త హై రేంజ్ లో ఉన్న వారైతే దాడికి కూడా పాల్పడతారు. హైదరాబాద్ పాతబస్తీలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ రెచ్చిపోయారు. చార్మినార్ బస్ డిపో సమీపంలో జిలాని అనే యువకుడిపై దాడికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దాడి దృశ్యాలు రికార్డ్ కూడా అయ్యాయి.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఓ గల్లీలో కూర్చున్న జిలాని దగ్గరకు వచ్చారు ముంతాజ్ ఖాన్. ఎమ్మెల్యే కనిపిస్తే నమస్తే పెట్టవా అంటూ యువకుడి చెంప చెళ్లుమనిపించారు. దీంతో అతడికి ఎడమ దవడ భాగంలో గాయాలు అయ్యాయి. దీనిపై హుస్సేనిఅలం పీఎస్ లో కంప్లయింట్ చేశాడు జిలాని.
ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు జంకుతున్నారని అంటున్నాడు బాధితుడు. ప్రస్తుతం ఎమ్మెల్యే దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.