తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతమైన కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతం ఆదివారం సాయంత్రం కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్ జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలోని అమేబేడ అభయారణ్యంలో మావోయిస్టు కీలక నేతలు సమావేశం అయ్యారని పక్కా సమాచారం అందుకున్న డిస్ట్రిక్ రిజర్వ్‌డ్ గార్డ్స్ ప్రత్యేక బలగాలు అమేబేడ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.
ఈ క్రమంలోనే మావోయిస్టుల శిబిరం ఉన్న స్థావరంని కనిపెట్టిన డిస్ట్రిక్ రిజర్వ్‌డ్ గార్డ్స్ ప్రత్యేక బలగాలు.. ఆ శిబిరాన్ని చుట్టుముట్టాయి. డిఆర్జీ బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరువైపులా భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి.
మావోయిస్టు అగ్ర నాయకుడి ఆధ్వర్యంలో ముప్పై మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు సమావేశం అయ్యారని కోవర్టుల ద్వారా విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు.. వారి స్థావరం ఉన్న అమెబేడ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరుపుతూనే తమ స్థావరాన్ని విడిచి అభయారణ్యంలోకి పారిపోయారు.
కాంకెర్ జిల్లా ఎస్పి శలబ్ సిన్హా ఈ ఘటనపై స్పందిస్తూ.. ” ఎన్‌కౌంటర్ జరిగిన మాట వాస్తవమే ” అని అంగీకరించారు. ” మావోయిస్టు శిబిరం వద్ద వారి వస్తు సామాగ్రి, రేషన్ సరుకులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో అక్కడ సిగ్నల్ వ్యవస్థ పనిచేయడం లేదని.. కూంబింగ్ పార్టీ మైదాన ప్రాంతానికి వస్తే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు” అని ఎస్పీ శలబ్ సిన్హా తెలిపారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎన్‌కౌంటర్‌లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదనే తెలుస్తోంది.