భారతీయ విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా ఇంటర్వ్యూ కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఇంటర్వ్యూ వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో భారతీయుల వీసా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.
అనుకున్న దానికన్నా చాలా వేగంగా వీసా ప్రాసెసింగ్ జరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. రాబోయే ఏడాదిలో అది కొవిడ్ పూర్వస్థితికి చేరుకుంటుందని ఆయన అన్నారు. గత కొన్నెళ్లలో చూస్తే గతేడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేశామని పేర్కొన్నారు.
అమెరికా వీసాల కోసం పలు దేశాల్లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. భారత్ సహా పలు దేశాల్లో నెలల తరబడి పెద్ద ఎత్తున వీసా దరఖాస్తులు పెండిగ్‌లో ఉంటున్నాయి. దీనిపై రోజువారీ బ్రీఫింగ్లో భాగంగా ఆయన మాట్లాడారు. వీసా దరఖాస్తుదారుల సమస్యలను తాము అర్థం చేసుకున్నామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో అమెరికా వీసాలకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఈ క్రమంలో వీసా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కొత్త ఉద్యోగులను నియమించుకున్నట్లు చెప్పారు. భారత్లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్లు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేశాయన్నారు.
గతేడాది లక్షా 25 వేల స్టూడెంట్ వీసాలను భారతీయులకు జారీ చేశామన్నారు. 2016 తర్వాత ఇదే అత్యధికమని ఆయన అన్నారు. కానీ, ఇంకా ఇప్పటికి కొందరు దరఖాస్తుదారులు వీసాల కోసం ఎదురు చూస్తునే ఉన్నారన్నారు. వీసా ఇంటర్వ్యూ దరఖాస్తుల వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.