మక్కామసీదు పేలుళ్ళ కేసు కొట్టివేత

11 ఏళ్ళ పాటు సాగిన మక్కామసీదు పేలుళ్ళ కేసులో నిందితులనందరినీ నాంపల్లిలోని స్పెషల్ ఎన్ ఐ ఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది. నిందితులపై నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఆరెస్సెస్ ప్రచారక్ దేవేంద్ర గుప్తా, మధ్యప్రదేశ్ కు చెందిన లోకేష్ శర్మ, గుజరాత్ వాసి స్వామి అసిమానంద, ఓ ప్రైవేటు ఉద్యోగి భరత్ మోహన్ లాల్ రాతీశ్వర్, రాజేందర్ చౌదరి పై చార్జిషీట్లు దాఖలయ్యాయి. బాధితులతో బాటు 226 మంది సాక్షులను విచారించి 411 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు.

కేసు పూర్వాపరాలలోకి వెళ్తే.. 2007 మే 18న శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా.. మక్కా మసీదులో జరిగిన పేలుళ్ళలో 9 మంది మరణించారు. అనంతరం జరిగిన ఘర్షణలు, పోలీసు కాల్పుల్లో మరో అయిదుగురు మృతి చెందారు. మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 58 మందికి పైగా గాయపడ్డారు.

ఈ కేసులో ఎన్ఐఏ 10 మందిని నిందితులుగా గుర్తించింది. వారిలో ఒకరు మృతి చెందగా.. నలుగురిపై విచారణ కొనసాగింది. మిగతా ఐదుగురిపై చార్జిషీట్లు దాఖలు కాగా…,వారికి శిక్ష ఖరారు కావలసి ఉంది. అయితే వీరిపై సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, అందువల్ల ఈ కేసును కొట్టివేస్తున్నామని కోర్టు పేర్కొంది.