హీరోయిన్ మాలాశ్రీ.. ఒకప్పుడు వెండితెరకు ఏలిన నటి. యాక్షన్ క్వీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఉన్నట్టుండి సడెన్ గా మాయమైపోయింది. ఒక్కసారిగా సినిమాలు మానేసింది. దీనికి కారణం ఏంటి? అర్థాంతరంగా తెలుగుతెరకు ఎందుకు ఆమె దూరమైంది? ఈ ప్రశ్నలకు మాలాశ్రీ స్వయంగా సమాధానం ఇచ్చింది.
“తెలుగులో సాహసవీరుడు-సాగరకన్య సినిమా చేస్తున్న టైమ్ అది. వెంకటేష్ అందులో హీరో. ఆ సినిమా తర్వాత నాకు పెళ్లయింది. అలా అని నేను సినిమాలు ఆపేయలేదు. ఆ టైమ్ లో కన్నడలో ఫుల్ బిజీ అయిపోయాను. అక్కడ కూడా నాకు యాక్షన్ ఇమేజ్ వచ్చేసింది. వరుసపెట్టి సినిమాలు చేశాను. ఓవైపు కన్నడలో వరుసగా సినిమాలు, ఇంకోవైపు కుటుంబ బాధ్యతలు. ఇలా నాకు తెలియకుండానే టాలీవుడ్ కు దూరమైపోయాను.”
తను టాలీవుడ్ కు దూరమైనప్పటికీ, ఇప్పటికీ తనకు ఓ గుర్తింపు ఉందని అది తనకు చాలంటోంది మాలాశ్రీ. సాధారణంగా హీరోయిన్లంతా ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమౌతారని, తను మాత్రం సక్సెస్ లో ఉన్నప్పుడే దూరమయ్యానని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో మళ్లీ నటించాలని ఉందన్న మాలాశ్రీ.. ఎప్పుడు అది జరుగుతుందో తనకు తెలియదని ప్రకటించింది.
కెరీర్ లోకి ఎంటర్ కాకముందే ప్యాంట్-షర్ట్ వేసుకొని తిరిగేదంట మాలాశ్రీ. అలా మగాడిలా ఉండడానికి అమితాబ్ బచ్చన్ గారే కారణం అని చెప్పుకొచ్చింది. అలా రఫ్ గా కనిపించడం, ఆ తర్వాత కెరీర్ లో తనకు యాక్షన్ ఇమేజ్ రావడానికి బాగా పనికొచ్చిందని అంటోంది ఈ మాజీ హీరోయిన్.