మలయాళ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొవిడ్ సంబంధిత సమస్యలతో గత ఇరవై నాలుగు రోజులుగా ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్రసీమలో దిగ్గజ హాస్యనటుల్లో ఒకరిగా ఇన్నోసెంట్ పేరుతెచ్చుకున్నారు.
1972లో సినీ రంగ ప్రవేశం చేసిన ఇన్నోసెంట్ 750కిపైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. మజావిల్ కావడి జాతకం, పథం నిలయిలే తీవండి, రావణప్రభు, వేషం, స్నేహవీడు, మనసిన్నక్కరేతో పాటు పలు మలయాళ సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పడించారు. మలయాళంతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించాడు ఇన్నోసెంట్. ఇంగ్లీష్ భాషలో ఓ సినిమా చేశారు.
గత ఏడాది కడువాతో పాటు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు ఇన్నోసెంట్. అతడు నటించిన పాచువుమ్ అద్భుతవిళక్కుమ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. నటుడిగానే కాకుండా రచయిత, ప్రొడ్యూసర్‌గా, నేపథ్య గాయకుడిగా రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మలయాళ చిత్రసీమలో పేరుతెచ్చుకున్నారు ఇన్నోసెంట్.
2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చాళకూడి నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు ఇన్నోసెంట్. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇన్నోసెంట్ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాదం నెలకొంది. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు మలయాళ సినీ నటులు ఇన్నోసెంట్ మృతికి సంతాపం వ్యక్తంచేశారు.