మన సినిమాలు అంతర్జాతీయస్థాయి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధ్భుత నటి జ్యోతిక ప్రధానపాత్రలో చేసిన ‘రాక్షసి’ సినిమా దేశం ఎల్లలు దాటి విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. కథ, కథనాలే కాకుండా ఇందులో ‘సూపర్ హీరో’ కేరెక్టర్ చేసిన జ్యోతిక అద్భుతంగా నటించిందని మలేషియా విద్యాశాఖ మంత్రి మస్‌జ్లీ బిన్ మాలిక్ ప్రశంసించారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బిన్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై రివ్యూ చేశారు.
‘రాక్షసి’ సినిమాకు గౌతమ్‌రాజ్ డైరెక్షన్ అందించారు. ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. మూవీలో జ్యోతిక ఓ స్కూల్లో టీచర్ పాత్రను చేసింది. ఓ ప్రభుత్వ పాఠశాల తప్పుడు దారిలో వెళ్తుంటే బెత్తం పట్టుకోని అక్కడి టీచర్లను, పిల్లలను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ సినిమాను చూసిన మలేషియా మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు.
‘రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదలైంది. గత రాత్రి అధికారులతో కలిసి ఈ సినిమా చూశాను. స్వయంగా ఈ సినిమా రివ్యూ రాయాలని నిర్ణయించుకున్నా. ఇది అందరూ చూడాల్సిన సినిమా. కథ అద్భుతంగా ఉంది. జ్యోతిక పాత్ర పర్‌ఫెక్ట్‌గా ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఈ సినిమా చూడటం విభిన్న అనుభూతినిచ్చింది. సినిమాలోని ప్రతి సన్నివేశం మా దేశ పరిస్థితుల్ని ప్రతిబింబించింది’. అని బిన్ అన్నారు.