గ్రేటర్ ఎన్నికల్లో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్‌కు.. మల్కాజిగిరి నియోజకవర్గం ఏడారిలో ఒయాసిస్‌లా కనిపిస్తోంది. నగరమంతా రాజకీయ వాతావరణం ఒకలా ఉంటే.. అక్కడి డివిజన్లలో మాత్రం హస్తం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఎక్కువగా వరద సాయం గురించే అసంతృప్తి వ్యక్తం చేస్తోంటే.. మల్కాజిగిరిలో మాత్రం స్థానిక అభివృద్ధి గురించే మెజార్టీ జనం మాట్లాడుతున్నారని… ఇదే విషయం కాంగ్రెస్‌కు అక్కడ సానుకూల అంశంగా మారిందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి.
మల్కాజిగిరిలో వరదల కంటే ముందు నుంచే అక్కడి స్థానికుల్లో ప్రభుత్వంపై చాలా అసంతృప్తి నెలకొని ఉన్నట్టు ఈ సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా చిన్నారి శ్రీమేధ ఓపెన్ నాలాలో పడి చనిపోవడం.. మల్కాజిగిరి వాసులను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చే డబ్బులు, చేసే వాగ్ధానాల కంటే .. తమ ఏరియా అభివృద్ధి కావడమే ముఖ్యమన్న ఆలోచనను వారు వ్యక్తపరిచారు. ఇటీవల యాప్రాల్‌లో ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యే మైనంపల్లిని రోడ్డు కోసం రోడ్డు మీదే నిలబెట్టి కడిగిపారేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అభివృద్ధిని మాత్రమే మల్కాజిగిరి వాసులు కాంక్షిస్తున్నట్టుగా సర్వేలు అభిప్రాయపడ్డాయి.
మరోవైపు ఎంతసేపూ బీజేపీ అభ్యర్థులు, టీఆర్ఎస్‌పై.. టీఆర్ఎస్ క్యాండిడేట్లు బీజేపీపై విమర్శలకు పరిమితం కావడం.., అందులోనూ మతం అంశాన్నే ప్రధాన విషయంగా ప్రచారం చేయడం విసుగు తెప్పిస్తోందని సర్వేల్లో జనం అభిప్రాయపడ్డారట. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి మాటలు ఏదో తెలియని ధైర్యానిస్తున్నాయని మల్కాజిగిరివాసులు చెప్తున్నారట. అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూనే.. ప్రభుత్వ అవినీతిని ఆయన ప్రశ్నిస్తున్న తీరు ఆలోచింపజేస్తోందని అన్నారట. ముఖ్యంగా పాతిక మందిని ఇవ్వండి.. ప్రశ్నిస్తా అంటూ ఆయన ఇస్తున్న పిలుపునకు మంచి స్పందన వస్తోందని తెలిసింది.
మొత్తంగా సర్వేల్లో మల్కాజిగిరిలో మెజార్టీ ఓటర్లు రేవంత్ రెడ్డి పట్ల సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో నగరమంతా ఫలితం ఎలా ఉన్నా.. మల్కాజిగిరిలో మాత్రం మళ్లీ రేవంత్ రెడ్డి హవానే కనిపించే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.