జగిత్యాల జిల్లాలో మల్లన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం మల్లన్న నామస్మరణలతో మారు మోగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి భక్తులు వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
డబ్బు చప్పుల మధ్య భక్తి శ్రద్దలతో సామూహికంగా బోనాలు ఎత్తుకుని ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం సామూహికంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు గొర్రెలు, మేకలను స్వామి వారికి సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించిన గొర్రెలు, మేకలకు ఆలయ కమిటీ టెండర్ వేస్తుంది. దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. బోనాల సందర్భంగా శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. అనంతరం మల్లన్న స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు.
ఈ జాతరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామబాద్ తో పాటు పలు జిల్లాల భక్తులు భారీగా వచ్చారు. కోరుకున్న కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు స్వామి వారికి బంగారాన్ని (బెల్లం) పంచి పెట్టడం, గొర్లు, మేకలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.