వేలేరు పోలీస్ స్టేషన్ నుంచి తీన్మార్ మల్లన్న విడుదలయ్యారు. వరంగల్ ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. అరెపల్లిలో రైతుల్ని కలిసిన సందర్భంగా అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి వేలేరు పీఎస్ కు తరలించారు.
అరెపల్లి గ్రామాన్ని శనివారం ఉదయం నుంచే పోలీసులు చుట్టుముట్టారు. కాజీపేట, పరకాల ఏసీపీలు, నలుగురు సీఐలు పహారా కాస్తున్నారు. అయితే.. వాళ్ల కళ్లుగప్పి బైక్ పై అరెపల్లికి చేరుకుని రైతులను కలిశారు మల్లన్న. ప్రభుత్వం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేసే వరకు పోరాటం సాగించాలని రైతులకు సూచించారు.
అన్నదాతలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. స్థానికంగా ఉన్న పోచమ్మ ఆలయం దగ్గర సమావేశం జరుగుతుండగా.. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే.. వారు బూట్లతో రావడంతో ప్రజలు, రైతులు తిరగబడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
Advertisements
మల్లన్నను పోలీసులు ఎత్తుకుని తీసుకెళ్లారు. అరెపల్లి నుంచి వేలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే.. పోలీసుల చర్యతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మల్లన్న అరెస్ట్ సమయంలో.. గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేశారు.