పెద్దల మాటలు నమ్మిన పాపానికి బ్రతుకే ప్రశ్నార్థకంగా మారింది. సీఎం కేసీఆర్ ఇలాకాలో యధేచ్చగా జరుగుతున్న కాంట్రాక్టర్ల జులుం బక్కచిక్కిన రైతులకు శాపంగా మారింది. దేశంలో మెరుగైన ప్యాకేజి ఇస్తామని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ గ్రౌండ్ లెవెల్‌లో చేస్తున్న దౌర్జన్యం ఇది. మల్లన్న సాగర్ నిర్మాణంలో ఆగమైపోతున్న రైతన్నల గోస ఇది..
‘మా భూములు మల్లన్నసాగర్ కాల్వల పోయినై. ఏడాదిగా పనులే లేవు. ఎవుసం తప్ప ఇంకో పని తెల్వనోల్లం. భూములు ఇవ్వటానికి ముందు ఆనాటి మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి మస్తు మాటలు చెప్పిర్రు. కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, అన్నిటికి నేనుంటా.. నా సంగతి తెలుసు కదా, మాట ఇస్తే నిలబడుతా అంటూ చెప్పి, ఇప్పుడు మొఖం కూడా చూస్తాలేడు’ అంటూ రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
‘ఊర్లు పోయినోళ్ళకు ఇచ్చినట్లు మాకూ ప్యాకేజీ ఇవ్వాలని కోరాం, దీంతో కోర్టు పనులపై స్టే ఇచ్చినా కోర్టు స్టేను ఉల్లంఘించి అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బాజాప్తుగా పనులకు పూనుకుంటున్నారు..’ అని బాధితులు చెబుతున్నారు. ఎంతమంది ఉపాధి కోల్పోతున్నారో ఇంటింటికీ తిరిగి సర్వే చేయకుండా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్నారు. ఇప్పటికే గతంలో పలుమార్లు కోర్ట్ ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. కోర్ట్ కూడా చివాట్లు పెట్టింది. గత పదిరోజులుగా తోగుట నిర్వాసితులు అడ్డుపడుతున్నారని మూడ్రోజులుగా రాత్రివేళ మల్లన్నసాగర్ కట్ట పనులు కొనసాగిస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాసం, పునర్ ఉపాధి కోసం సిద్దిపేట జిల్లా తోగుటకు చెందిన 73 మంది నిర్వాసితులు కోర్టుకెళ్లారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు పనులు చేపట్టొద్దని స్టే కూడా విధించింది. ఈ నేపథ్యంలో తూతూమంత్రంగా సర్వే చేపట్టి మధ్యలోనే ఆపేసి పనులు కొనసాగించారు. బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో సీరియస్‌గా పరిగణించింది. ప్రస్తుతం స్టే ఉందని చెప్తే మాకు కాపీ అందలేదని బుకాయిస్తున్నారని, కోర్టు తీర్పును ఉల్లంఘించొద్దని ఉత్తర్వుల కాపీ అధికారులకు చూపెట్టినా వాటిని చిత్తు ాకాగితాలుగా కొట్టి పారేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు రాత్రిపూట పనులు చేస్తున్నారు.
మల్లన్నసాగర్ కట్ట కాలువ పనుల్లో తొగుట మండల కేంద్రానికి చెందిన 150 మంది రైతులు 2600 ఎకరాలు కోల్పోయారు. గ్రామంలో మొత్తం 3600 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 300 కుటుంబాలకు ఆ భూమే జీవనాధారం. ప్రస్తుతం అక్కడ ఎకరాకు రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకు ధర పలుకుతున్నది. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.6లక్షలు చెల్లిస్తున్నది. అదే వేములఘాట్‌లో మూడేండ్లు రిలేదీక్షలు చేయడంతో సర్కార్ దిగొచ్చి రూ.11 లక్షలు చెల్లించింది.
ఇక పొట్టకూటి కొసం పక్క ఊర్లకు వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది. అలా అయిన పని దొరికే పరిస్థితి లేదు. చాలా గ్రామాలు సాగర్ లో పోతున్నాయి. వాళ్ళకే పనిలేదు. దింతో సిద్దిపేట, గజ్వెల్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఏ రోజు పనికి పోలేక పోయిన పస్తులుండాల్సిందే అంటున్నారు నిర్వాసితు రైతులు, రైతు కూలీలు.