– బతకలేక చావలేక జీవచ్ఛవాల్లా ప్రజలు
– మీటర్ లోతులో ఊరుతున్న నీరు
– రిజర్వాయర్ నిర్మాణానికి 1650 ఎకరాల భూమి
– కొత్తగా మరో 80 ఎకరాల సేకరణ
– ఆదుకోవాలంటున్న తుక్కాపురం గ్రామస్తులు
– తొలివెలుగుతో తమ గోడునెల్లబోసుకున్న బాధితులు
రాష్ట్రంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద ఉన్న ముంపు గ్రామాలకు అండ లేకుండా పోయిందని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. పుట్టి పెరిగిన గ్రామాలను వదిలి దిక్కు మొక్కు లేని గ్రామాలకు పోయి బతకలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ కట్ట కింద ఉన్న తుక్కాపురం గ్రామానికి సమీపంలోని 1650 ఎకరాల భూమిని రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించారు అధికారులు. దీంతో ఇప్పుడు తమకు చేసుకోను పని లేక.. ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులు కోల్పోయిన భూమికి తగిన నష్ట పరిహారం కూడా ఇవ్వ లేదని ఆరోపించారు ముంపు బాధితులు. ఐదు, ఆరు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అందించిన పరిహారం కలికి గంజికి రాకుండా పోతోందని తమ గోడునెళ్లబోసుకున్నారు. తమ కష్టాలను తొలివెలుగుకు చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం జరగకుంటే చావే శరణ్యం అంటున్నారు.
50 టీఎంసీ సామర్ధ్యం గల మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు 10 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు సొరంగ మార్గాల ద్వారా నీటిని విడుదల చేశారు. అందులో నుండి గత మూడు నెలల క్రితం 10 టీఎంసీల నీటిని వదిలిపెట్టారు. మరో టీఎంసీ కోసం దాదాపు 70 నుండి 80 ఎకరాల భూమిని సేకరించి కాలువను తవ్వుతున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఉన్న 10 టీఎంసీల నీటి కారణంగా అక్కడి ప్రజలు బహిర్భూమికి కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని మొరపెట్టుకున్నారు. రెండు ఫీట్ల లోతు తవ్వితే నీరు ఊరే పరిస్థితి ఉందంటున్నారు అక్కడి ప్రజలు.
గ్రామాల్లో చేసుకోను పని లేక, ఉండటానికి తావు లేక ఊరినొదిలిపెట్టే పరిస్థితుల్లో చస్తూ బతుకుతున్నామంటున్నారు బాధితులు. ప్రాజెక్ట్ ఒడ్డున గ్రామం ఉండటంతో ఇండ్లలోనే నీటి ఊటలు వస్తున్నాయని అంటున్నారు. నిర్మాణంలో భాగంగా చెరువు కోసం తవ్వకాలు జరపడంతో పాములు, విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని.. దీంతో బిక్కు బిక్కు మంటూ బతకాల్సి వస్తోందని అంటున్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణంలో 5 ఎకరాల పై చిలుకు భూమిని కోల్పోతే కేవలం రూ. 2.80 లక్షలు మాత్రమే ఇచ్చారని అంటున్నారు బాధితులు. ఎకరాకు కేవలం 70 నుండి 80 వేల రూపాయలే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఉన్న భూమి పోయినంక మాకు ఊరెందుకు.. మేము ఏం చేసి బతకాలంటూ కంటనీరు పెట్టుకున్నారు ప్రజలు. ప్రాజెక్ట్ నిర్మాణంలో పెట్టిన భరాలకు బండరాళ్లు వచ్చి ఇండ్ల మీద పడుతున్నాయని అంటున్నారు, రాత్రి సమయాల్లో బిక్కుబిక్కు మంటూ కంటి మీద కునుకులేకుండా తెల్లవార్లు నిద్రలు లేకుండా.. గడుపుతున్నామంటున్నారు. తమ బతుకులకు భరోసా కల్పించకుంటే చావులే శరణ్యం అంటున్నారు బాధితులు.