దేశమంతా కరవు వచ్చినా.. తెలంగాణకు మాత్రం రాదన్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ లోకి నీటిని విడుదల చేశారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నీటిని వదిలారు కేసీఆర్. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.
హైదరాబాద్ కు దాహార్తిని తీర్చే మహత్తర ప్రాజెక్టు.. మల్లన్నసాగర్ అని చెప్పారు కేసీఆర్. దీన్ని అడ్డుకోవడానికి దాదాపు 600కు పైగా కేసులు వేశారని గుర్తు చేశారు. ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిదని.. పరిహారం అందని వారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చూస్తామని హామీఇచ్చారు.
పాలమూరు జిల్లాలో కూడా మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు కేసీఆర్. ప్రాజెక్టులపై అవగాహన లేనివాళ్లు చిల్లర ప్రయత్నాలు చేస్తారని విమర్శించారు. వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చిన్నచిన్న లోపాలుంటే ఇంజినీర్లు సరిచేస్తారని తెలిపారు. తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోందని వివరించారు.
ఇక జాతీయ రాజకీయాల గురించి మాట్లాడిన కేసీఆర్.. దేశం దారి తప్పుతోందన్నారు. దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని.. కర్నాటకలో మతకల్లోలాలు రేపారని అన్నారు. హైదరాబాద్ లోనూ జరుగుతాయని ప్రచారం చేశారని చెప్పారు. దేశంలో అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని.. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేసేలా ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేశంలో మార్పులు జరగాలన్న ఆయన.. హైదరాబాద్ లో ఐటీ పెరుగుతోందని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలం సరిహద్దులో మల్లన్న సాగర్ ను నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు. 5 స్లూయిజ్ ల ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్, సింగూర్ ప్రాజెక్టు, తపాస్ పల్లి రిజర్వాయర్,మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు వాడతారు.