– ఒక చోట తరిమిస్తే మరోచోటకు..
– అక్కడా అన్యాయమే!
– కొండపోచమ్మ, మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్లు ఆగేదెప్పుడు?
వారంతా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ బాధితులు. ఉన్న భూమిని, ఇంటిని ప్రభుత్వం లాగేసుకుంటే బోరున విలపిస్తూ వేరే గ్రామాలకి వెళ్లిపోయారు. తమ ఊరిలో ఎకరం భూమి పోతే.. వచ్చిన సొమ్ముతో కొత్త ప్రాంతంలో అంత భూమిని కొనలేకపోయారు. చిన్న ప్లాట్లను సరిపెట్టుకున్నారు. కానీ.. అది కూడా వారికి దక్కకుండా పోయింది.
వివరాల్లోకి వెళ్తే… కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కోసం భూములు కోల్పోయిన కొందరు దళితులు.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలోని ప్లాట్లను కొనుగోలు చేశారు. గ్రామ శివరులోని సర్వే నెంబర్ 133/1లో మొత్తం 7 ఎకరాల 34 గుంటల భూమి ఉండగా.. 2016లో మనోహరాబాద్ నుండి పెద్దపల్లికి రైల్వేలైన్ కోసం 2 ఎకరాల 23 గుంటలను రైల్వే అధికారులకు తీసుకున్నారు. మిగిలిన 5 ఎకరాల 11 గుంటల భూమిని చొప్పదండి లీల, రవీందర్.. ఎరువుల యాదగిరి, కర్నె శ్రీనులకు జీపీఏ ప్రకారం ఇచ్చారు. వారు శ్రీ గాయత్రి డెవలపర్స్ వెంచర్ ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్కో ప్లాట్ ను 121 గజం చొప్పున 5,00,000 రూపాయలకు అమ్మకానికి పెట్టారు.
కొండపోచమ్మ, మల్లన్న సాగర్ బాధితులు ఆ వెంచర్ లో భూములు కొనుగోలు చేశారు. 2019లో రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అయితే.. 2016లో జరిగిన రైల్వే లైన్ సర్వే ప్రకారంగా కాకుండా ప్లాన్ మార్చడంతో ఈ దళిత కుటుంబాలకు సమస్య వచ్చి పడింది. రైల్వే అధికారులు తీసుకున్న 2 ఎకరాల 23 గుంటల భూమిలో విద్యుత్ హై టెన్షన్ ఉండడంతో ఆ స్థలం పనికి రాదని.. కింద ఉన్న ఈ దళితుల భూమిలో నుంచి రైల్వే ట్రాక్ కు ప్లాన్ వేశారు.
విషయం తెలుసుకున్న బాధితులు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. రోజులు గడుస్తున్నాయే గానీ న్యాయం జరగలేదు. వినతి పత్రాలు ఇవ్వడమే గానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. రైల్వే అధికారులు మాత్రం పనులు మొదలు పెట్టేశారు. ఆ సమయంలో పనులను అడ్డుకోవడంతో తమను కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లారని.. 34 మందికి 2,00,000 రూపాయల చొప్పున నష్టపరిహారం కింద ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు బాధితులు. ఈ విషయాన్ని గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డికి అప్పగించారని.. అయితే.. రైల్వే పనులు పూర్తవుతున్నా తమకు ఎలాంటి పరిహారం రాలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
నష్టపరిహారం కోసం ఎక్కని ఆఫీస్ మెట్లు లేవని.. మొక్కని అధికారుల కాళ్లు లేవని వాపోతున్నారు బాధితులు. న్యాయం చేయనందుకు ఆ రైల్వే ట్రాక్ తమపై నిర్మించండని దళిత కుటుంబాలు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. తమ భూముల్లో రైల్వే లైన్ వేసినందుకు.. 2 ఎకరాల 23 గుంటల భూమిని తమ పేర రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.