మోడీ సర్కార్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము చేత చేయించకపోవడం, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించకపోవడం కరెక్ట్ కాదన్నారు.
పార్లమెంటు అనేది దేశ అత్యున్నత శాసన వ్యవస్థ అని ఆయన అన్నారు. దేశంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రతి పౌరునికీ రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తే, అది రాజ్యాంగ ఔచిత్యం, ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేస్తుందన్నారు.
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను మోడీ సర్కార్ అవమానపరుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని లాంఛన ప్రాయం చేసిందన్నారు. చూస్తుంటే కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే దళిత, గిరిజన వర్గాల వారు రాష్ట్రపతిగా ఎన్నుకునేలా మోడీ సర్కార్ హామీ ఇచ్చినట్టు కనిపిస్తోందన్నారు.
పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీని ఇటీవల లోక్ సభ స్పీకర్ కోరారు. ఈ మేరకు విషయాన్ని లోక్ సభ సెక్రటేరియట్ ఈ నెల 18న ట్వీట్ చేసింది. అప్పటి నుంచి పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై దుమారం రేగుతోంది.