కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ వరుసగా మూడోరోజు విచారించిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దీంతో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తో పాటు పలువురు కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీజేపీకి ప్రైవేట్ సైన్యంలాగా ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులపై క్రమశిక్షణా చర్యలకు ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ (శాంతి భద్రతలు) ఎస్‌పీ హుదా ఖండించారు. బారికేడ్లను ధ్వంసం చేసి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు వచ్చారని, అందుకే తాము అడ్డగించామని ఆయన తెలిపారు. అంతేకాని తాము ఎవరిపై బలప్రయోగం చేయలేదన్నారు.