మనం ఏమి ఖర్మ చేసుకుంటే ఈ ముఖ్యమంత్రి మనకు దొరికాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ విప్ ఈరవత్రి అనిల్ తదితర నాయకులతో కలిసి భట్టి విక్రమార్క పరిశీలించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిని చూస్తుంటే రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని భట్టి అన్నారు. ఆ రోజుల్లో సదుపాయాలు లేక ఒక బెడ్ మీద ముగ్గురు, నలుగురు, అవసరం అయితే కుప్పగా మనుషులను పెట్టి ట్రీట్‌మెంట్ చేసేవారని, ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని భట్టి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిగా ఉన్నా, ఇక్కడ కూడా ఒక బెడ్‌పై ముగ్గురిని ఉంచుతున్నారని అన్నారు. చిన్న పిల్లల వార్డులో ఆరేళ్ల అమ్మాయిని, 8 ఏళ్ల అబ్బాయిని ఒకే బెడ్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని చెప్పారు. ఇక మరో వార్డులో ఒకే కుటుంబంలోని ఒక పురుషుడు, మహిళను ఒక బెడ్‌పై ఉంచి వైద్యాన్ని అందిస్తున్నారని వివరించారు. ఇవన్నీ చూస్తుంటే మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా లేక అనాగరిక ప్రపంచంలో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని అన్నారు. ఒక మంచంపై ముగ్గురు రోగులు ఎలా ఉండగలరు అని భట్టి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ‘ఒకరి కాళ్ళు మరొకరి తలమీద…ఇటుపక్క వ్యక్తి చేతులు వేరే బెడ్ మీద’ – వాళ్ళని చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతున్నాయని విక్రమార్క అన్నారు. ‘ఇదేనా బంగారు తెలంగాణ? ఇదేనా ఆత్మ గౌరవ తెలంగాణ?’ అని భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహ స్వరంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక్కడి పరిస్థితిపై సూపరింటెండెంట్‌ను అడిగితే అన్ని విషయాలు ఉన్నతాధికారులకు తెలియజేసినా అక్కడి నుంచి స్పందన రాకపోయేసరికి వున్నవాటితోనే వైద్యం కొనసాగిస్తున్నట్టు చెప్పారని భట్టి మీడియాకు వివరించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మన ఖర్మకు దొరికాడీ సీఎం