తెలంగాణలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నశిస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 45 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రిగా వారి సమస్యలు పరిష్కరించాల్సిన కేసీఆర్ కక్షసాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థను గౌరవించే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 50 వేల మంది కార్మికులు సమ్మె చేస్తుంటే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని అనడం ఏంటని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభ్యుదయ భావాలు కలిగినదని…అలాంటి సమాజం కేసీఆర్ చేతిలో నలిగిపోతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం పంచుకున్నారని..వారితో వెంటనే చర్చలు జరపాలని భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని కోరారు.