ఉండడానికి గూడు లేక గుడిసెలేసుకొని జీవనం సాగిస్తుంటే అక్రమార్కుల కండ్లు చూసి ఓర్వలేదు. నోటికాడి బువ్వను కాకులు తన్నుక పోయినట్టు అధికారులు ఉన్న గుడిసెలను పీకేసి అన్యాయంగా రోడ్డున పడేశిర్రని బాధితులు ఆవేదన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గౌలిదొడ్డి పరిధిలో 250 వడ్డెర కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా గుడిసెలేసుకొని నివాసముంటున్నాయి. వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధాంతరంగా కూల్చేశారు అధికారులు. దీంతో ఆ 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
30 ఏళ్లుగా ఉంటున్న 250 కుటుంబాలను అనాధలను చేసి రోడ్డున పడేయడం దారుణమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. సోమవారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారు వివిధ శాఖలకు సంబందించి విద్యుత్ కనెక్షన్, రేషన్ కార్డు తదితర గుర్తింపు కార్డులు పొంది ఉన్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నివాసం కోల్పోయిన వారికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. బాధితులకు పక్కా ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు రవి.