మల్లు రవి..టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ ఊరు కొనపూర్ లో పర్యటించిన సందర్బంగా.. తాము పుట్టుకతో భూస్వాములమని ప్రకటించడం అహంకారానికి, భూస్వామ్య భావజాలానికి పరాకాష్టగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతల్లో నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్యం, విశాల హృదయాలు ఉంటే.. టీఆర్ఎస్ నేతల్లో అవినీతి, భూస్వామ్యం, రాచరికం, సంకుచితత్వం నిండి ఉన్నాయి.
మోతిలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రూలు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రజలకోసం త్యాగం చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం దేహాలను ముక్కలు చేసుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవి చేతిలో ఉన్నప్పటికీ తీసుకోకుండా ప్రజల కోసం త్యాగం చేశారు.
టీ. అంజయ్య, పీవీ నర్సింహారావు, దామోదరం సంజీవయ్య లాంటి వాళ్ళు నీతిగా బతికి ఆదర్శంగా ఉన్నారు. అరవై ఏండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులెవరు ఆస్తులు కూడగట్టుకోలేదు. ప్రజల భూములను కబ్జా పెట్టి దక్కించుకోలేదు. కానీ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రజల ఆస్తులు కబ్జాలకు గురవుతున్నాయి.
కాంగ్రెస్ నాయకులను భూస్వాములని మీరు విమర్శిస్తుంటే.. రాహుల్ గాంధీ మాత్రం కేసీఆర్ ను రాజుతో పోల్చుతున్నారు. టీఆర్ఎస్ నేతలవి విశాల భూములైతే.. మా కాంగ్రెస్ నాయకులవి విశాల హృదయాలు. అందుకే.. 140 ఏళ్ళు అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో సుస్తిరంగా ఉంది. గడిచిన ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ పార్టీపైన ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు.