తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మణికం ఠాగూర్, మరికొందరు నేతలపై.. ఆ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీహెచ్ తీరుపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. తనపై కూడా ఆరోపణలు చేయడంతో… టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వీహెచ్‌పై సీరియస్ అయ్యారు.
క్రమశిక్షణా ఉల్లంఘించి మాట్లాడాలంటే తాము చాలా మాట్లాడగలమని మల్లు మండిపడ్డారు. కానీ అధిష్టాన నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తున్నందున ఏమీ అనలేకపోతున్నామని చెప్పారు. ఎవరికో చెంచాగిరి చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రేవంత్ రెడ్డి తమ ప్రాంతానికి చెందినవారు, ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ కూడా కావడంతోనే ఆయన్ను పీసీసీ చీఫ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచానని స్పష్టం చేశారు. 165 మంది నాయకులతో పాటు తన అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుందని తెలిపారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పానని.. ఇందులో చెంచాగిరి ఏముందని వీహెచ్‌ను మల్లు రవి ప్రశ్నించారు. ఎవరి పేరు చెబితే వారికి చెంచాగిరి చేసినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. ఏఐసీసీ దూతగా వచ్చిన మాణికం ఠాగూర్ పై ఆరోపణలు చేస్తే.. అవి అధిష్టానం పైన చేసినట్టేనని మల్లు రవి అభిప్రాయపడ్డారు. నిజం చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విదంగా 165 మంది అన్ని స్థాయిల్లోని నాయకుల అభిప్రాయాలను మణికం ఠాగూర్ తెలుసుకున్నారని.. ఇంత ప్రజాస్వామ్యబద్దంగా ఎప్పుడూ పీసీసీ చీఫ్ ఎంపిక జరగలేదని గుర్తు చేశారు.
నివేదికలో ఏముందో అధిష్టానానికి తప్ప ఎవరికి తెలియదని.. పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఆరోపణలు చేయడం తగదని వీహెచ్‌కు హితవు పలికారు. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని సూచించారు మల్లు రవి.