ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైంది కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి అధికారంలో ఉన్న పంజాబ్ లో సైతం సత్తా చాట లేకపోయింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిపై అనేక రకాలుగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందించారు.
తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు ఐదు రాష్ట్రాల ఫలితాలకు ఎలాంటి సంబంధం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు వేరు.. తెలంగాణలో వేరని చెప్పారు. స్థానికంగా ఉండే అంశాలే రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆయన.. ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. మన ఊరు-మన పోరు ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. 13న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దళితులకు మూడు ఎకరాల భూమి, ఇళ్లు, నిరుద్యోగ భృతి సహా గ్రామాల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు మల్లు రవి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపిస్తామని స్పష్టం చేశారు.