తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు స్వరాజ్యం. 13 ఏళ్ళ వయసులోనే రజాకార్లను ఎదిరించిన పోరాడారు. రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు.
1931లో సూర్యాపేట జిల్లా కరివిరాల కొత్తగూడెంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ. వీరికి వందలాది ఎకరాల భూమి ఉండేది. 1945-46లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్ ను గడగడలాడించారు స్వరాజ్యం. సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.
మహిళా కమాండర్ గా పని చేశారు. అప్పటి నిజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించింది. వెట్టిచాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ పిలుపు మేరకు ఉద్యమాలు చేశారు స్వరాజ్యం. బాధితులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. దీనికోసం తన కుటుంబానికి చెందిన భూముల్లోని ధాన్యం ఇచ్చేశారు.
స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా.. ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాట పరిధిని విస్తరించి జమీందారుల నుంచి భూమిని లాక్కొని పేదలకు పంపిణీ చేశారు స్వరాజ్యం. ఆ తర్వాత కమ్యూనిస్టు ముఖ్య నాయకురాలిగా ఎదిగారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, నల్గొండ పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు. 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు.