పౌరసత్వ సవర చట్టాన్ని పశ్చిమబంగాలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తెగేసి చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీ (సోమవారం)న కోల్ కతాలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. వివాదస్పదమైన ఈ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పౌరసత్వ చట్టానికి అనుగుణంగా ఎన్.ఆర్.సి ప్రక్రియను చేపట్టనీయమని తెలిపారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో బలవంతంగా పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. పౌరసత్వ చట్టం భారతీయులను విభజిస్తుందని…తాను అధికారంలో ఉన్నంత వరకు పశ్చిమబంగా రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా దేశాన్ని వదిలి వెళ్లడానికి వీల్లేదన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తూ చేసిన ఈ చట్టాన్ని విపక్షాలే కాకుండా హిందూత్వ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇది వివక్షతో కూడినదని..రాజ్యాంగం కల్పించిన సమానత్వం హక్కును ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నాయి.
మరోవైపు పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఈరోజు సుప్రీం కోర్టు నాశ్రయించారు. తమ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని మొయిత్రా తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేను అభ్యర్ధించారు. దీనిపై మెన్షనింగ్ అధికారిని సంప్రదించాలని జస్టిస్ బోబ్డే సూచించారు.