ఫైర్ బ్రాండ్ సీఎంగా పేరు తెచ్చుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా దీదీ ఇంటిలోకే చడీచప్పుడు కాకుండా ప్రవేశించినట్టు తెలిసింది. శనివారం అర్ధరాత్రి సమయంలో సీఎం ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన ఆ ఆగంతకుడు రాత్రంతా అక్కడే ఒక గోడ వద్ద ఉన్నట్టు సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ .. సీఎం ఇంటి వద్ద భద్రత ఏ స్థాయిలో ఉందో బయటపడింది.
విచిత్రమేంటంటే సీఎం నివాసమంటే చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేంత పహారా ఉంటుంది. అంత కట్టుదిట్టమైన భద్రతలోనూ ఆ గుర్తు తెలియని వ్యక్తి రాత్రి నుంచి తెల్లవారేదాకా సీఎం ఇంటిలోనే ఉన్నాడంటే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి దీదీ వ్యక్తిగత సెక్యూరిటీ అధికారులది. ఎట్టకేలకు ఆదివారం ఉదయం ఆగంతకుడిని గుర్తించిన అధికారులు అతడిని అరెస్ట్ చేసి అతడి నుంచి వివరాలు రాబట్టారు.
సాధారణంగా ముఖ్యమంత్రి నివాసమంటేనే భారీ భద్రత. అలాంటిది దీదీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అంత నిఘానీడలోనూ ఒక సాధారణ వ్యక్తి సింపుల్ గా సీఎం ఇంటిలోకి రావటం… గంటలు గంటలు అక్కడే గడపటం భద్రతా సిబ్బందిని కలవరపెడుతోంది. ఇంతకీ తమ వైఫల్యం ఎక్కడ అని తలలు పట్టుకుంటున్నారు సీఎం సెక్యూరిటీ అధికారులు.
అటు సంగతి తెలియగానే రాష్ట్రానికి చెందిన అత్యున్నత పోలీస్ అధికారులు సీఎం నివాసానికి చేరుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. వచ్చినవాడు దొంగతనానికి వచ్చాడా.. లేదంటే అతని మానసిక స్థితి సరిగ్గా లేదా అనే అయోమయంలో ఉన్నారు పోలీస్ అధికారులు. ఏది ఏమైనా తనే ఒక సంచలనంగా వార్తల్లోకెక్కే దీదీ.. ఇలా కూడా మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.