బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాసిన లేఖలు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీయేతర పార్టీలు కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చిన మమతా బెనర్జీ… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడవం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేసీఆర్, బీజేపీ మనిషే అని మమతా బెనర్జీ భావిస్తున్నారని.. అందుకే ఆయనకు లేఖ రాయలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ వ్యవహారంలో షాకింగ్ విషయం ఏమిటంటే.. స్వయంగా ఇదే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కోల్‌కతా వెళ్లి మరీ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడదాం అని.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని మమతా బెనర్జీని కలిసి కోరారు. అంతలా బీజేపీ వ్యతిరేక పార్టీగా కేసీఆర్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నా.. మమతా బెనర్జీ మాత్రం తాజాగా ఆయన్ను బీజేపీయేతర శక్తిగా గుర్తించకపోవడం విచిత్రంగా మారింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఢిల్లీ, ఒడిశా,జార్ఖండ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, హేమంత్ సొరేన్.. అలాగే NCP చీఫ్ శరద్ పవార్, DMK అధ్యక్షుడు స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, RJD చీఫ్ తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, PDP చీఫ్ మెహబూబా ముఫ్తీలకు కూడా లేఖ రాశారు మమతా బెనర్జీ. చివరికి బీజేపీతో ఫ్రెండ్లీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా లేఖ రాసిన మమతా బెనర్జీ.. తెల్లారితే మోదీ మెడలు వంచుతాం, అమిత్‌షా అంతు చూస్తాం అంటూ వీర లెవెల్లో డైలాగులు చెప్పే టీఆర్ఎస్‌కు లేఖ రాయకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆమె లేఖ రాయకపోవడం గమనార్హం.
మమతా బెనర్జీ లేఖలో ఏముందంటే..
ఫెడరల్ స్ఫూర్తికి BJP తూట్లు పొడుస్తోందని.. పశ్చిమ బెంగాల్ సహా దేశమంతా ప్రజస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని లేఖలో ఆరోపించిన మమత.. ఈ సమయంలోనే భావస్వారూప్య పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. మోడీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆమె లేఖలో పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఈ పోరాటంలో మనస్ఫూర్తిగా కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.