పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నాలుగు రోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆమె ఢిల్లీకి వెళుతున్నారు.
ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్ర పతి అభ్యర్థి ప్రకటన సమయంలో గవర్నర్ జగదీప్ దన్ ఖడ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మలు దీదీతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు తమ పార్టీ దూరంగా ఉంటుందని దీదీ కీలక ప్రకటన చేశారు.
ఉపరాష్ట్ర పతి ఎన్నికలను శనివారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీతో ఆమె భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సమయంలో ఢిల్లీలో ఉంటారని, కానీ ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.
గత మూడేండ్లుగా టీఎంసీ సర్కార్ కు గవర్నర్ జగదీశ్ ధనఖర్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రతి విషయంలోనూ టీఎంసీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటూ ముప్పు తిప్పలు పెడుతున్నారు.
ఈ క్రమంలో ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికై ఢిల్లీకి వెళితే రాష్ట్రంలో తనకు పెద్ద ఉపశమనం దక్కుతుందనే ఆలోచనలో మమతా ఉన్నట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో తనను విపక్షాలు సంప్రదించలేదనే కోపంతో దీదీ ఉన్నట్టు తెలుస్తోంది.