దేశంలోని ప్రతిపక్ష నేతలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రతిపక్ష నేతలంతా సమావేశం కావాలని లేఖలో కోరారు.
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయాల్లోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె వెల్లడించారు. అందరికీ అనుకూలంగా ఉండే చోట సమావేశమై ఈ విషయం గురించి చర్చిద్దామన్నారు. ఈ అణచివేత శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని అభ్యుదయ వాదులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను అణిచివేయాలన్న బీజేపీ ఉద్దేశానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు మమత. న్యాయ వ్యవస్థ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందన్నారు. కానీ ప్రస్తుతం కొన్ని పక్షపాత రాజకీయ జోక్యాల వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి అని అన్నారు.
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజలు ముఖ్యమైన మూలస్తంభాలని, వాటిలో ఏదైనా ఒక భాగానికి భంగం కలిగినా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పారు మమతాబెనర్జీ.